YS Jagan election campaign at Vinukonda

పక్కనే నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ ఉన్నప్పటికీ వినుకొండ నియోజకవర్గంలో సాగు, తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తూ మున్సిపాల్టీలో డబ్బులు డ్రా చేసుకుంటున్నారు.  బొల్లాపల్లి మండలంలో తాగునీరు లేక బంధువులను కూడా ఇంటికి రావొద్దని ప్రజలు చెబుతున్నారు. 1996లో వరికపూడిసెల ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. తర్వాత ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రి అయినా ఆ ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పట్టించుకోలేదు. ఎన్నికలు రావడంతో ఇప్పుడు టెంకాయ కొట్టి, అనుమతులు మంజూరు చేసినట్టు బిల్డప్‌ ఇస్తున్నాడు. ఈ ప్రాంతం రైతులు మిర్చి, కంది, మినుము, పత్తి, వరి వంటి పంటలు ఎక్కువగా సాగు చేస్తారు. ఒక్కటంటే ఒక్క పంటకు కూడా ప్రభుత్వం మద్దతు ధరలు ఇవ్వలేదు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మనకు ఏం మేలు జరిగింది? అని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు.